Nagababu: ఆ సమయంలో పవన్ కల్యాణ్ కు చంద్రబాబు క్లీన్ పర్సన్ గా కనిపించారు: నాగబాబు

  • వైసీపీ అధినేతపైనే ఎక్కువ ఆరోపణలున్నాయి
  • అనుభవం ఉన్న నాయకుడనే చంద్రబాబుకు పవన్ మద్దతిచ్చాడు
  • టీడీపీ-జనసేన పొత్తుపై నాగబాబు వివరణ

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరగ్గా, టీడీపీకి జనసేన మద్దతుగా నిలిచింది. అయితే, అదే పొత్తు ఇటీవల ఎన్నికల్లో కూడా కొనసాగిందంటూ వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో ఆరోపించడం తెలిసిందే. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు వివరణ ఇచ్చారు.

2014లో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడైతే బాగుంటుందని తన తమ్ముడు పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిచ్చారని వెల్లడించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కు అందరిలోకి చంద్రబాబే క్లీన్ పర్సన్ లా కనిపించారని తెలిపారు. అప్పటికి చంద్రబాబుపై కొన్ని ఆరోపణలు ఉన్నా, వైసీపీ అధినేతపై ఉన్న అవినీతి ఆరోపణలతో పోల్చితే అవి చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే టీడీపీని గెలిపించాలని పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని, అయితే, ప్యాకేజీ మాట్లాడుకుని డబ్బులు తీసుకున్నాడని చాలా చవకబారు కామెంట్లు చేశారని నాగబాబు అన్నారు.

ఇటీవల ఎన్నికల్లో కూడా అదే ధోరణి కొనసాగిందని, పవన్ కల్యాణ్ ప్రజాదరణ పొందుతుండడం చూసి దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉందని ప్రచారం చేస్తూ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని వివరించారు. మీడియా మద్దతు లేకపోవడంతో తాము ఎంత ప్రతిఘటించినా ఫలితం లేకపోయిందని, ఈ ప్రచారం లాభదాయకంగా ఉందని అటు టీడీపీ వాళ్లు కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటించారని నాగబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News