: 'హెలికాప్టర్ల కుంభకోణం'లో ఎవరినీ వదలం: రక్షణ మంత్రి ఆంటోనీ


క్రాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ సర్కారు హాయాంలో మరో అవినీతి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖుల పర్యటనలకు వినియోగించే అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో అవినీతి జరిగిందనే ఆరోపణలు బలంగా తెరపైకి వచ్చాయి. ఒప్పందం కోసం భారత్ లో లంచాలు చెల్లించారంటూ ఇటలీకి చెందిన అగస్టా కంపెనీ సీఈఓ, దాని మాతృ సంస్థ ఫిన్ మెక్కానియా కంపెనీ సీఈఓలను ఇటలీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. దీంతో అటు ఇటలీలోనూ, ఇటు భారత్ లోనూ ఇది కలకలం సృష్టిస్తోంది. 

ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించామని రక్షణ మంత్రి ఆంటోనీ బుధవారం వెల్లడించారు. నివేదిక త్వరగా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆరు సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చామని తెలిపారు. విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని, దోషులని  తేలితే ఎవరినీ వదిలేది లేదని చెప్పారు. ఈ ఒప్పందం కుదర్చడంలో వాయుసేన మాజీ అధిపతి త్యాగి పాత్ర ఉందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. 

ఫిన్ మెక్కానియా ఇటలీ కంపెనీ. ప్రముఖుల పర్యటనలకు అత్యంత సురక్షితమైన హెలికాప్టర్లు కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2010లో ఫిన్ మెక్కానియాకు చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 12 హెలికాప్టర్ల సరఫరా ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఆ సంస్థ మూడింటిని భారత్ కు సరఫరా చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.3600కోట్లు.

దీనిని సొంతం చేసుకునేందుకు ఇందులో పది శాతం అంటే 360 కోట్ల రూపాయల వరకూ ఆ సంస్థ భారత్ లో అధికారులు, నేతలకు లంచాలుగా  చెల్లించిందనే ఆరోపణలపై ఇప్పుడు ఇటలీలో విచారణ ప్రారంభం అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన 9 హెలికాప్టర్లను దిగుమతి చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవినీతి వ్యవహారంపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News