Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు!: మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్ నేతలు హామీలను నిలబెట్టుకోలేదు
- త్వరలోనే అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వస్తాయి
- ప్రభుత్వం ఎప్పటివరకూ కొనసాగుతుందో నాకు తెలియదు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీతో చేతులు కలుపుతారో అని ఇరు పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటకలో త్వరలోనే మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని దేవెగౌడ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
బెంగళూరులో ఈరోజు దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ..‘మా ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ నేతల చర్యలు, ప్రవర్తన అందుకు అనుగుణంగా లేవు. మా ప్రజలు చాలా తెలివైన వాళ్లు. కాంగ్రెస్ నేతల చర్యలను వాళ్లు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో తనకు తెలియదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతీ డిమాండ్ ను జేడీఎస్ నెరవేర్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ తన బలాన్ని కోల్పోవడంతోనే లోక్ సభ ఎన్నికల్లో చిత్తు అయిందని చెప్పారు. తాము కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను నియమించాల్సిందిగా కోరామనీ, కానీ రాహుల్ గాంధీ కుమారస్వామినే పెట్టాలని సూచించారని దేవెగౌడ తెలిపారు.