Andhra Pradesh: ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుకి చెప్పాను: సుజనా చౌదరి
- దేశానికి సరైన నాయకుడు మోదీ
- మోదీతో విభేదం మంచిది కాదని బాబుకు చెప్పాను
- భవిష్యత్ లో టీడీపీ మరింత బలపడాలి
దేశానికి సరైన నాయకుడు మోదీ అని, ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుకి కూడా చెప్పానని టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీతో విభేదం మంచిది కాదని చంద్రబాబుకు చెప్పానని అన్నారు. బీజేపీలో చేరినందుకు ఆనందంగా ఉన్నా, టీడీపీని వీడినందుకు తనకు చాలా బాధగా ఉందని అన్నారు.
చంద్రబాబుపై తనకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదని, అలాగే ఉంటుందని, భవిష్యత్ లో టీడీపీ నిలదొక్కుకుని, బాగా బలపడాలని ఆకాంక్షిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో తనతో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు చేరారని చెప్పారు. ఏపీ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, బీజేపీతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుజనా చౌదరి చెప్పారు.