India: విచారణకు స్వయంగా హాజరుకండి.. జకీర్ నాయక్ కు ముంబై కోర్టు ఆదేశం!
- లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తాం
- ఉత్తర్వులు జారీచేసిన ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు
- ప్రస్తుతం మలేసియాలో ఉంటున్న జకీర్ నాయక్
ఇస్లాం మతప్రచారకుడు జకీర్ నాయక్ తమ ముందు స్వయంగా విచారణకు హాజరు కావాలని ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశించింది. వచ్చే నెల 31లోపు విచారణకు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేస్తామని హెచ్చరించింది. అక్రమ నగదు చలామణి కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
బంగ్లాదేశ్ లో మూడేళ్ల క్రితం 22 మందిని బలిగొన్న ఉగ్రదాడి సందర్భంగా తాము జకీర్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందామని కొందరు ఉగ్రవాదులు చెప్పడంతో జకీర్ నాయక్ కు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆయనపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, విదేశాల నుంచి అక్రమంగా నగదును స్వీకరించడం వంటి అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి.
ఈ నేపథ్యంలో జకీర్ నాయక్ నిర్వహిస్తున్న ‘పీస్ టీవీ’ ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ మూతపడ్డాయి. దీంతో అదే ఏడాది ఆయన తొలుత సౌదీ అరేబియాకు, అక్కడి నుంచి మలేసియాకు మకాం మార్చేశారు. 2017లో ఆయన పాస్ పోర్టును రద్దుచేశారు. ప్రస్తుతం జకీర్ మలేసియాలో తలదాచుకుంటున్నారు. అయితే ఆయన్ను భారత్ కు అప్పగించేందుకు ముస్లిం మెజారిటీ దేశమైన మలేసియా సుముఖత వ్యక్తం చేయడం లేదు.