KCR: ఏపీతో ఉల్లాసభరితమైన సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించాం: కేసీఆర్
- గతంలో ప్రతిరోజూ వివాదాలే ఉండేవి
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి మారింది
- సుదీర్ఘ సమయంపాటు క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమయం పాటు క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, సోదర రాష్ట్రమైన ఏపీతో ఉల్లాసభరితమైన స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని క్యాబినెట్ తీర్మానించిందని, ఇది తెలుగు ప్రజలకు శుభవార్తగా భావిస్తున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవనాలను తెలంగాణకు అప్పగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం స్నేహహస్తం చాచిందని, దాన్ని తాము కొనసాగించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
గతంలో పొరుగు రాష్ట్రాలతో అనేక వివాదాలు ఉండేవని, ప్రతి రోజూ బస్తీ మే సవాల్ అన్నట్టుగా ఉండేదని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారిందని తెలిపారు. కర్ణాటకతో సమస్యలు సమసిపోయాయని, ఇటీవల మూడుసార్లు పరస్పరం నీళ్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందని కేసీఆర్ వివరించారు.