Rapaka: నేను ఉన్నదే ఒక్కడ్ని... నాపై శ్రీకాంత్ రెడ్డి అన్నేసి బాణాలు ఎక్కుపెడితే ఎలా అధ్యక్షా?: జనసేన ఎమ్మెల్యే రాపాక ఫన్నీ కామెంట్స్

  • వైసీపీ మిత్రపక్షం బీజేపీ అంటూ రాపాక కామెంట్
  • మండిపడిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
  • నవ్వులు పూయిస్తూ వివరణ ఇచ్చిన రాపాక

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ప్రత్యేకహోదాపై తీర్మానం సందర్భంగా వాడీవేడి చర్చలతో పాటు ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగాయి. వాటితోపాటే కొన్ని సరదా సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. సభలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ, "అధ్యక్షా, నాపై శ్రీకాంత్ రెడ్డి అన్నేసి బాణాలు గురిపెట్టనక్కర్లేదు. సభలో మా పార్టీకి ఉన్నది నేనొక్కడ్నే అధ్యక్షా! నావైపు ఎవరూ లేరు... కనీసం జాలి చూపించండి అధ్యక్షా!" అంటూ నవ్వులు పూయించారు.

దాంతో స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, మిమ్మల్ని రక్షించడానికి స్పీకర్ ఉన్నాడని మర్చిపోకండి అంటూ అభయహస్తం అందించారు. సీఎం జగన్ కూడా రాపాక మాట్లాడుతున్న తీరును చిరునవ్వులతో ఆస్వాదించారు.

అనంతరం, రాపాక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ,  వైసీపీకి బీజేపీ మిత్రపక్షం అనడం తప్పేనని అంగీకరించారు. అయితే, ఆ పార్టీతో సఖ్యతగా ఉన్నారన్న కోణంలోనే తాను ఆ వ్యాఖ్య చేశానని, బీజేపీతో స్నేహపూర్వకంగా మెలిగి ప్రత్యేకహోదా తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

అంతకుముందు, రాపాక తన ప్రసంగంలో, వైసీపీ తన మిత్రపక్షం బీజేపీని ఒప్పించి ప్రత్యేకహోదా తీసుకురావాలని అనగానే, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జనసేన సభ్యుడు నోటికి ఏదిపడితే అది మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. బీజేపీతో తమకు ఎలాంటి పొత్తులేదని, టీడీపీతో జనసేనకు ఉన్న అంతర్గత పొత్తు గురించి అందరికీ తెలిసిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో, రాపాక సామరస్యపూర్వకంగా వివరణ ఇస్తూ నవ్వులు పూయించారు.

  • Loading...

More Telugu News