Varaprasad: మాజీ సీఎం కుమారుడు, కడప జిల్లా ఎంపీ... రూ. 100 కోట్లు ఆఫర్ చేశారు: అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!
- టీడీపీలో చేరాలని ప్రలోభాలు
- స్వయంగా తిరస్కరించాను
- 23 మందిని అలాగే లాగేశారన్న వరప్రసాద్
తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశంలో చేరితే, తనకు రూ. 50 కోట్ల క్యాష్, మరో 50 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇస్తామని చెబుతూ, మొత్తం రూ. 100 కోట్ల ఆఫర్ ను తన ముందుకు తెచ్చారని గూడూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత వి.వరప్రసాద్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కుమారుడు, కడప జిల్లాకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు, మరో నలుగురు మంత్రులు ఆ సమయంలో తనతో పాటు ఉన్నారని చెప్పారు.
అయితే, వారి ఆఫర్ ను తాను తిరస్కరించానని, కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేయడం తనకు ఇష్టం లేకపోయిందని అన్నారు. వైసీపీ టికెట్ పై గెలిచి తెలుగుదేశంలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలూ ఏ ఆశతో వెళ్లారో, వారిని ఎలా ప్రలోభ పెట్టారో తనకు అప్పుడు తెలిసిందని నిప్పులు చెరిగారు. అందుకే తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని మండిపడ్డారు. తాను నోరు తెరిచి మరిన్ని మాట్లాడితే, తెలుగుదేశం నేతలు అవమానంతో చావాల్సిందేనని దుయ్యబట్టారు.