munugodu: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు : అధిష్ఠానం ఆదేశం

  • ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌
  • షోకాజ్‌ నోటీసు ఇవ్వనున్న క్రమశిక్షణా సంఘం
  • ఈరోజు ఢిల్లీ వెళ్తున్న రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయమంటూ మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డికి త్వరలోనే షోకాజ్‌ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న రాజగోపాల్‌ మరో అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అడ్డుకోవాలంటే బీజేపీతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. మోదీ సాహసోపేత నిర్ణయాల వల్ల అన్ని రంగాల్లో దేశానికి గుర్తింపు లభించిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి మరోసారి పట్టం కట్టారని ఇటీవల కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, రానున్న రోజుల్లో మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వం తప్పిదాలే ఈ దుస్థితికి కారణమంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని భావిస్తున్నారు. అయితే ఆదివారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. తిరిగి రాగానే ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 

munugodu
komatireddy rajagopalreddy
Congress
BJP
  • Loading...

More Telugu News