Andhra Pradesh: ఎన్నికల సమయంలో తనపై దాడి ఘటనపై విచారణకు ఆదేశించిన ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
- విజయనగరం జిల్లాలో పర్యటించిన వైసీపీ నేత
- బాలాజీ కెమికల్ ప్లాంట్ మృతులకు రూ.20 లక్షల పరిహారం
- పార్వతీపురం జిల్లా డిమాండ్ ను సీఎం దృష్టికి తీసుకెళతానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలో బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతులు, బాధితుల కుటుంబాలను శ్రీవాణి పరామర్శించారు. ఈ దుర్ఘటనలో మరణించిన ఇద్దరు కార్మికులకు ఏపీ ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు.
అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యం చెరో రూ.15 లక్షలు నష్టపరిహారం అందించేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా పార్వతీపురాన్ని జిల్లాగా చేయాలన్న స్థానికుల డిమాండ్ ను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతానని శ్రీవాణి హామీ ఇచ్చారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కురుపాంలో తనపై దాడి జరిగితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా పోలీసులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.