Telangana: మద్యాన్ని అమ్మాయిపై పోసి అఘాయిత్యానికి ప్రయత్నం!
- ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై పోకిరీల ఆగడం
- యువతి కేకలు వేయడంతో సీసాలు విసిరేసి పరారీ
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఒంటరిగా వెళుతున్న యువతిపై కొందరు యువకులు అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. శంషాబాద్ కు చెందిన 23 ఏళ్ల యువతి ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలో విధులు నిర్వర్తిస్తోంది. అయితే, రాత్రి పొద్దుపోయాక విధులు ముగించుకుని తన నివాసానికి వెళుతుండగా ముగ్గురు ఆకతాయిలు బైక్ పై వెంబడించారు. లిమ్స్ హాస్పిటల్ కు సమీపంలో క్యాబ్ దిగి వెళుతున్న ఆమెపై తమ వద్ద ఉన్న మద్యాన్ని చల్లడం మొదలుపెట్టారు.
దానికితోడు అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓవైపు, పోకిరీలు, మరోవైపు చిమ్మచీకటి! దాంతో ఆ యువతి భయంతో పెద్దగా కేకలు వేయడంతో ఆ యువకులు పరారయ్యారు. వెళుతూ వెళుతూ తమ చేతిలో మద్యం సీసాలను యువతిపై విసిరేశారు. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.