Maoists: జార్ఖండ్‌లో మావోల పంజా.. ఐదుగురు పోలీసుల మృతి
- పెట్రోలింగ్ వాహనాన్ని అడ్డుకుని కాల్పులు
- ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి
- చత్తీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతం
జార్ఖండ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. పోలీసు గస్తీ బృందంపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల ఆయుధాలు తీసుకుని పరారయ్యారు. జార్ఖండ్-బెంగాల్ సరిహద్దులోని తిరుల్డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి అవినాష్ కుమార్ తెలిపారు. పెట్రోలింగ్ వాహనాన్ని అడ్డుకున్న మావోలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని పేర్కొన్నారు. కాల్పుల్లో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలా జిల్లాలో కమెండోలతో వెళ్తున్న పోలీసు వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. కాగా, చత్తీస్‌గఢ్‌లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో పోలీసులకు- మావోయిలుకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు.