West Bengal: వైద్యుల సమ్మె కారణంగా మృతి చెందిన పసికందు .. గుండెలకు హత్తుకుని రోదిస్తున్న తండ్రి.. ఫోటో వైరల్!
- చికిత్స పొందుతూ మృతి చెందిన రోగి
- ఆసుపత్రిపై రోగి బంధువుల దాడి
- తీవ్రంగా గాయపడిన జూనియర్ డాక్టర్లు
- సమ్మెకు దిగిన వైద్యులు
పశ్చిమ బెంగాల్లోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ ఓ రోగి సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో అతని బంధువులు ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దాడిని నిరసిస్తూ పశ్చిమబెంగాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు.
ఇదిలావుంచితే, ఓ బెంగాల్ వాసి భార్య రెండు రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లిన ఆ తండ్రికి నిరాశే ఎదురైంది. సమ్మెలో ఉన్న కారణంగా వైద్యం చేయడం కుదరదని వైద్యులు తెగేసి చెప్పారు. దీంతో ఆ పసికందు కన్నుమూసింది. తన బిడ్డ మృతదేహాన్ని ఎత్తుకుని గుండెలవిసేలా రోదిస్తున్న ఆ తండ్రి బాధను ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. వైద్యుల సమ్మె ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఫోటోనే నిదర్శనమంటూ దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు డాక్టర్ల తీరుపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.