saptagiri: నేటి సినిమా రివ్యూ : 'వజ్రకవచధర గోవింద'
- ఆకట్టుకోని కథాకథనాలు
- కథలో అనవసరమైన మలుపులు
- ఫరవాలేదనిపించిన సంగీతం
కోట్ల విలువ చేసే నిధిని చేజిక్కించుకోవడానికి చేసే అన్వేషణకి సంబంధించిన కథలు గతంలో చాలానే వచ్చాయి. ఆ నిధి బంగారం రూపంలో వున్నా .. వజ్రాల రూపంలో వున్నా దానిని దక్కించుకోవడానికి జరిగే ప్రయత్నాలు .. పర్యవసానాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి కథకు కామెడీని .. ఎమోషన్ ను జోడించి, 'వజ్రకవచధర గోవింద' టైటిల్ తో గ్రామీణ నేపథ్యంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అరుణ్ పవార్. ఈ విషయంలో ప్రేక్షకులను ఆయన ఎంతవరకూ మెప్పించగలిగాడో చూద్దాం.
ఈ కథ రాయలసీమ ప్రాంతంలోని 'పరశురామ క్షేత్రం' అనే గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరిని తన గుప్పెట్లో పెట్టుకున్న 'బంగారప్ప'(విజయ్ జస్పార్), అక్కడ దొరికే వజ్రాలను చాలా తక్కువధరకి కొంటుంటాడు. అదే ఊరిలోని ఆలయంలో, రాజుల కాలానికి చెందిన నిధి ఉందని పురావస్తు శాఖకి చెందిన కొలంబస్ నారాయణ తెలుసుకుంటాడు. ఆ నిధిని చేజిక్కించుకునే పనిలో తనకి సహకరిస్తే 10 కోట్లు ఇస్తానని గోవింద్ (సప్తగిరి)కి చెబుతాడు.
ఇక ఆ నిధి ఆ ఆలయంలో ఎక్కడ వుంచబడిందో తెలుసుకోవడం కోసం, ఆ గ్రామంలోకి దొంగబాబాగా గోవింద్ అడుగుపెడతాడు. అక్కడి గ్రామస్తులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే ఆయనకి త్రిపుర(వైభవీ జోషి) పరిచయమవుతుంది .. అది కాస్తా ప్రేమకి దారితీస్తుంది. ఆలయంలో దొంగతనానికి గోవింద్ వచ్చాడని తెలిసి ఆమె నిలదీస్తుంది.
అయితే, ఒక మంచి ఉద్దేశంతోనే తాను ఈ పనికి ఒప్పుకున్నానంటూ, గోవింద్ తన ఫ్లాష్ బ్యాక్ విప్పుతాడు. దాంతో ఆమె గోవింద్ ను అర్థం చేసుకుని ఆయన బ్యాచ్ లో చేరిపోతుంది. 200 కోట్ల విలువ చేసే బంగారం కోసం వెళ్లిన ఈ బ్యాచ్ కి, 150 కోట్ల ఖరీదు చేసే ఒక వజ్రం దొరుకుతుంది. అది బంగారప్ప బంగ్లాలో నుంచి మాయమైన వజ్రం కావడంతో, కథానాయకుడికి కష్టాలు మొదలవుతాయి. ఇక ఇక్కడి నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
దర్శకుడు అరుణ్ పవార్ కథను సరిగ్గా రాసుకోలేకపోయాడు. అందువల్లనే కథనాన్ని పట్టుగా నడిపించలేకపోయాడు. దేవాలయంలో దాచబడిన నిధి అంటూ మొదలెట్టి, కథను 'వజ్రం' వైపుకు తీసుకెళ్లాడు. పోనీలే 'వజ్రం'తోనే సరిపెట్టుకుందాం అనే ప్రేక్షకుడిని ఫస్టాఫ్ వరకు మాత్రమే సహనంతో వుంచగలిగాడు. హీరో బ్యాచ్ దగ్గర తన వజ్రం ఉందనే సంగతి బంగారప్పకి తెలిసిపోతుంది. దాంతో ఆయనకి ఆ వజ్రం ఇచ్చేయమని అంతా గోవింద్ తో చెబుతారు.
కానీ ఆ వజ్రం గురించి తనకి తెలియదని గోవింద్ అంటాడు. ఇక్కడి నుంచే .. అంటే సెకండాఫ్ నుంచి స్క్రీన్ ప్లే పూర్తిగా బలహీనపడిపోయింది. అనవసరమైన మలుపులు .. పేలవమైన సన్నివేశాలు ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తాయి. 'జబర్దస్త్' నుంచి ఎక్కువమంది ఆర్టిస్టులను తీసుకోవడం వలన, వెండితెరపై 'జబర్దస్త్' ఎపిసోడ్ చూస్తున్నామా? అనే ఫీలింగ్ కూడా ఒక దశలో కలుగుతుంది. సప్తగిరిను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయిన అరుణ్ పవార్, విలన్ సీన్స్ విషయంలో కొంత కేర్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది.
గోవింద్ పాత్రలో సప్తగిరి తనదైన శైలిలో నటించాడు. అయితే, కామెడీ సీన్లలో ఓకే అనిపించినా, ఎమోషన్, యాక్షన్ సీన్లలో మాత్రం తేలిపోయాడు. ఒకానొక దశలో కథాకథనాలు పూర్తిగా బలహీనపడటంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. విలన్ గా విజయ్ జస్పార్ బాగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో పెత్తందారీగా ఆయన నటనలో సహజత్వం కనిపించింది. ముందుముందు ఈ తరహా పాత్రలు ఆయన ఎక్కువగా చేసే అవకాశాలు వున్నాయి.
ఇక కొత్తమ్మాయి వైభవీ జోషీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు .. హీరో పక్కనే ఉంటుంది గనుక హీరోయిన్ అనుకోవాలంతే. ఇక ఎమ్మెల్యే ప్రసన్న లక్ష్మీగా అర్చన చాలా అందంగా కనిపించింది. కానీ ఆమె పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం వలన, ఎలా అర్థం చేసుకోవాలో ప్రేక్షకులకు అర్థం కాలేదు.
దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ప్రవేశం వున్నవాడు కావడం చేత, అక్కడక్కడా ఆ మెరుపులు కనిపించాయి. ఉన్నంతలో విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. కీచురాయి .. కీచురాయి అనే పాటకి కాస్త ఎక్కువ మార్కులు వేసేయ్యొచ్చు. ప్రవీణ్ వనమాలి ఛాయాగ్రహణం మాత్రం చెప్పుకోదగినదిగా వుంది. ఆలయ నేపథ్యంలో సన్నివేశాలను .. హీరో బ్యాచ్ ను విలన్ బంగ్లాకి తీసుకొచ్చే సన్నివేశాన్ని చాలా బాగా చిత్రీకరించాడు. ఇక ఎటొచ్చి ఎడిటర్ గా కిషోర్ మద్దాలి తన కత్తెరకి మరింత పదును పెట్టాల్సింది. మొత్తంగా చూస్తే సప్తగిరి కామెడీ లోని స్పార్క్ ను ఇష్టపడేవాళ్లను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
- పెద్దింటి