TTD: టీటీడీ చైర్మన్ గా రాజీనామా చేయలేదనే నాపై కక్ష కట్టారు!: పుట్టా సుధాకర్ యాదవ్
- నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు
- స్విమ్స్ డైరెక్టర్ నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు
- నేను సిఫార్సు చేసినా, జీవో ప్రకారమే నియామకాలు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవికి తాను రాజీనామా చేయలేదన్న దుర్దతోనే కొందరు తనపై కక్ష కట్టారని టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ విమర్శించారు. తాను టీటీడీ చైర్మన్ గా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ రవికుమార్ తాను అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఎం జగన్ కు ఫిర్యాదు చేయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.
రాజకీయ నాయకుడైన తనను చాలామంది కలుస్తూ ఉంటారని, అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల కోసం చాలామంది తనను కలిశారని చెప్పారు. తాను సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల(జీవో) ప్రకారమే అధికారులు ఉద్యోగాలు ఇస్తారని గుర్తుచేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విచారణలో తాను దోషిగా తేలితే, ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.