Chandrababu: పైలట్, ఎస్కార్ట్ భద్రత లేకుండానే అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు... టీడీపీ వర్గాల్లో ఆందోళన
- జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు
- గతంలో జగన్ కు ఇదేరీతిలో కాన్వాయ్ ఉండేదన్న వైసీపీ
- సెక్యూరిటీ వ్యవహారాల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ విజ్ఞప్తి
ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటిరోజున విపక్ష నేత చంద్రబాబునాయుడు పైలట్, ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే శాసనసభ ప్రాంగణం వద్దకు చేరుకోవడం టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు తాజాగా పైలట్, ఎస్కార్ట్ వాహనాలను తొలగించారు. ఓ ప్రముఖుడు ప్రయాణించే సమయంలో కాన్వాయ్ లో ముందుగా వెళ్లే వాహనాన్ని పైలట్ అని, వెనుకగా ప్రయాణించే వాహనాన్ని ఎస్కార్ట్ అని అంటారు.
అయితే, గతంలో జగన్ విపక్షనేతగా ఉన్న సమయంలో పైలట్, ఎస్కార్ట్ లేని కాన్వాయ్ ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే రీతిలో ఏర్పాట్లు చేసినట్టు వైసీపీ చెబుతోంది. కానీ, చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నందున పైలట్, ఎస్కార్ట్ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ వర్గాలంటున్నాయి. మొదట భద్రతా వ్యవహారాల కమిటీతో చర్చించి, ఆ తర్వాతే మార్పులు చేర్పులు చేయాలని టీడీపీ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.