Pakistan: పాకిస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న ఆసీస్ ఓపెనర్లు
- తప్పిన వాన గండం
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- తొలి వికెట్ కు 146 పరుగులు జోడించిన ఫించ్, వార్నర్
ఎట్టకేలకు ఐసీసీ వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ వరుణుడి ప్రభావం నుంచి తప్పించుకుని సాఫీగా ఆరంభమైంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు కూడా వానగండం పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించినా ఇప్పటివరకైతే వరుణుడి జాడలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ కు తన నిర్ణయం ఎంత తప్పో కాసేపటికే తెలిసొచ్చింది.
ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ పరుగుల వర్షం కురిపించారు. ఇద్దరూ తొలి వికెట్ కు 22.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టుకు తిరుగులేని ఆరంభాన్ని అందించగా, ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఫించ్ 82 పరుగులు చేసి అమీర్ బౌలింగ్ లో అవుట్ కాగా, వార్నర్ 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 30 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు. స్మిత్ 10 పరుగులకే వెనుదిరిగాడు. వార్నర్ కు తోడుగా మ్యాక్స్ వెల్ ఆడుతున్నాడు.