Nayanathara: నయనతార సినిమాపై హైకోర్టులో పిటిషన్
- చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోలైయుతీర్ కలాం’
- సినిమాపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన బాలాజీ
- జూన్ 21న నిర్మాతలు వివరణ ఇవ్వాలని ఆదేశం
‘బిల్లా2’ ఫేం చక్రి తోలేటి దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం ‘కోలైయుతీర్ కలాం’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను సంపాదించుకుంది. తమిళ రచయిత సుజాతా రంగరాజన్ నవల ‘కోలైయుతీర్ కలాం’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిక్కుల్లో పడింది.
‘కోలైయుతీర్ కలాం’ నవల హక్కుల్ని రూ.10 లక్షలు ఇచ్చి సుజాతా రంగరాజన్ భార్య నుంచి తాను కొనుగోలు చేసినట్టు బాలాజీ కుమార్ అనే దర్శకుడు పేర్కొంటూ, మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది కాపీ రైట్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కాబట్టి సినిమా విడుదలను అడ్డుకోవాలని కోర్టును కోరారు. నేడు బాలాజీ పిటిషన్ను పరిశీలించిన కోర్టు సినిమా విడుదలపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా చిత్ర నిర్మాతలు జూన్ 21న వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిజానికి ఈ చిత్రం జూన్ 14న విడుదల కావాల్సి ఉంది. అయితే హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల నేపథ్యంలో ఈ చిత్రం వాయిదా పడింది.