D Vitamin: సూర్యరశ్మిలోని 'డి విటమిన్' కు క్యాన్సర్ కు అడ్డుకట్ట వేసే శక్తి!
- మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధన
- 4 సంవత్సరాల్లో 80 వేల మందిపై పరిశోధన
- సూర్యరశ్మి ద్వారా వచ్చే డి విటమిన్ శ్రేష్టమంటున్న నిపుణులు
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణవుతున్న ప్రమాదకర జబ్బు క్యాన్సర్. ప్రారంభ దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేమో కానీ, ఒక్కసారి ముదిరాక క్యాన్సర్ మనిషి ప్రాణాలను బలిగొనడం తథ్యం. అయితే, సూర్యరశ్మి ద్వారా లభించే డి విటమిన్ కు క్యాన్సర్ ను నయం చేసే శక్తి ఉందంటున్నారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా 4 సంవత్సరాల వ్యవధిలో 80,000 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించారు. డి విటమిన్ ద్వారా 13 శాతం మరణాలు తగ్గించవచ్చని పరిశోధనకు నాయకత్వం వహించిన మిచిగాన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ తారెక్ హేకల్ తెలిపారు.
ఇకమీదట క్యాన్సర్ స్పెషలిస్టులు తమ ప్రిస్క్రిప్షన్ లో డి విటమిన్ ను కూడా తప్పకుండా రాయాల్సి ఉంటుందని హేకల్ అన్నారు. చికాగోలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, డి విటమిన్ కారణంగా క్యాన్సర్ రోగుల ఆయుర్దాయం పెరుగుతుందని అన్నారు. డి విటమిన్ మాత్రల రూపంలో కూడా లభ్యమవుతున్నా, సూర్యరశ్మి ద్వారా లభించేదే నాణ్యమైన డి విటమిన్ అని స్పష్టం చేశారు.