USA: వేశ్యల్ని టార్గెట్ చేస్తూ పోలీసులకు సవాల్ గా మారిన సైకోకిల్లర్
- పోలీసుల అదుపులో అనుమానితుడు
- డెట్రాయిట్ లో ఒక్కొక్కరుగా వేశ్యల అదృశ్యం
- పాడుబడిన ఇళ్లలో మారణకాండ
అమెరికాలోని డెట్రాయిట్ లో ఓ సైకో కిల్లర్ అఘాయిత్యాలు వెలుగుచూశాయి. పాడుబడిన ఇళ్లలో మహిళల శవాలు కనిపించడంతో కొంతకాలంగా డెట్రాయిట్ పోలీసులకు సవాలుగా మారింది. దానికితోడు నగరంలోని వేశ్యలు ఒక్కొక్కరుగా అదృశ్యం అవుతుండడం వారికి కంటిమీద కునుకులేకుండా చేసింది.
డెట్రాయిట్ నగరంలో మార్చి నెల నుంచి తరచుగా మహిళల మృతదేహాలు లభ్యమవుతుండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట 52 ఏళ్ల నాన్సీ హారిసన్ అనే మధ్యవయస్కురాలు విగతజీవిగా ఓ పాడుబడ్డ భవంతిలో పడివుండగా గుర్తించారు. ఆ తర్వాత మే నెలలో ట్రెవెసెనే ఎల్లిస్ (53) సైతం అదే తరహాలో మృత్యువాత పడింది. వీరిద్దరూ వేశ్యలని పోలీసుల విచారణలో తెలిసింది.
ఆ తర్వాత కూడా డెట్రాయిట్ నగరానికి తూర్పున ఉన్న పాడుబడిన ఇళ్లలో ఇదే రీతిలో అనేక మంది మహిళల శవాలు దర్శనమిచ్చాయి. దాంతో, హంతకుడు సైకో అయ్యుంటాడని, వేశ్యలపై పగబట్టి వరుసగా వారినే టార్గెట్ చేస్తున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఆ సైకో కిల్లర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ముఖ్యంగా, వేశ్యలను ఈ విషయంలో పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా పాడుబడిన ఇంట్లోకి పిలిస్తే వెళ్లవద్దని స్పష్టం చేశారు.
కాగా, ఈ దారుణ హత్యాకాండకు సంబంధించి డీఏంజెలో కెన్నెత్ మార్టిన్ అనే 34 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. డెట్రాయిట్ నగరం తూర్పుభాగంలో ఉన్న పాడుబడిన ఇళ్ల వద్ద సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.