Bilkis bano: గుజరాత్ అల్లర్ల కేసు.. ఉద్యోగ విరమణకు ఒక్క రోజు ముందు ఊడిన ఐపీఎస్ ఉద్యోగం!

  • గుజరాత్ అల్లర్ల కేసులో దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు 
  • సమర్థించిన సుప్రీంకోర్టు
  • సుదీర్ఘ కాలం తర్వాత నిందితురాలికి ఊరట

ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ఓ ఐపీఎస్ అధికారి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో దోషిగా తేలడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో నిందితుడిగా వున్న గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ భగోరాను బాంబే హైకోర్టు దోషిగా తేల్చడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో గత నెల 31న ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా, 30న ఆయనను తప్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్‌ బానో అనే మహిళపై  సామూహిక అత్యాచారం జరిగింది. ఈ అల్లర్లలో ఆమె రెండున్నరేళ్ల పాప సహా ఆమె కుటుంబానికి చెందిన 14 మంది హత్యకు గురయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై సుదీర్ఘకాలంపాటు పోరాడిన బానోకు ఎట్టకేలకు ఊరట లభించింది.

బానోకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు  రూ.50 లక్షల నగదు, ఉద్యోగం, వసతి సదుపాయాలు కల్పించాలంటూ గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, అప్పట్లో రాష్ట్ర పోలీసు అధికారిగా ఉండి 2006లో గుజరాత్ కేడర్ ఐపీఎస్‌గా ప్రమోషన్ పొందిన భగోరా సహా పలువురు పోలీసులను బాంబే హైకోర్టు దోషులుగా తేల్చింది. బాంబే హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ఏడాది మార్చిలోనే ఆదేశించింది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో గత నెల 30న భగోరాను తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ఉద్యోగం కోల్పోయిన భగోరా ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలకు దూరమైనట్టే.

Bilkis bano
Gujarat
riots
IPS Officer
RS Bhagora
  • Loading...

More Telugu News