Gali: గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి పర్యటనకు సుప్రీంకోర్టు అనుమతి

  • ఐసీయూలో చికిత్స పొందుతున్న గాలి మామయ్య
  • బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలంటూ గాలి అర్జీ
  • విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వేసవి సెలవుల విభాగం

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లవచ్చంటూ సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి మామయ్య బళ్లారిలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆయన్ను పరామర్శించడానికి బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలంటూ గాలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గాలి దాఖలు చేసుకున్న అర్జీపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (వేసవి సెలవుల విభాగం) ఇందిరా బెనర్జీ రెండు వారాలకు అనుమతి మంజూరు చేశారు.

గాలి జనార్దన్ రెడ్డిపై గతంలో అక్రమ మైనింగ్ ఆరోపణలు రావడం, ఆపై ఆయన జైలుకు కూడా వెళ్లడం తెలిసిందే. 2015లో షరతులతో కూడిన బెయిల్ పై ఆయన బయటటికి వచ్చారు. అయితే, జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో అడుగుపెట్టకూడదని, అక్కడ సాక్ష్యాలను ఆయన నాశనం చేసే అవకాశం ఉందని కోర్టు భావించింది. అప్పటినుంచి గాలి బళ్లారి వెళ్లాలంటే సుప్రీం అనుమతి తప్పనిసరిగా మారింది. కేవలం బళ్లారిలో మాత్రమే కాదు, ఏపీలోని అనంతపురం, కడప జిల్లాల్లోనూ జనార్దన్ రెడ్డికి ప్రవేశం లేదు.

  • Loading...

More Telugu News