Jagan: చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు అంచనాలకు మించి దోచుకున్నారు: సీఎం జగన్

  • మా హయాంలో అలాంటి పాలన ఉండదు
  • ప్రతి టెండర్ జ్యుడిషియల్ పర్యవేక్షణలో నిర్వహిస్తాం
  • పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం

ఏపీ సీఎం జగన్ రాష్ట్రపాలనను పూర్తి పారదర్శకంగా తీర్చిదిద్దే విషయంలో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ తన పార్టీ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం మొత్తం తమవైపే చూస్తున్న ఈ తరుణంలో ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశారు. తాము వేసే ప్రతి అడుగు తమ గ్రాఫ్ పెంచే విధంగా ఉండాలన్నారు. ప్రతి చర్య ప్రజలకు దగ్గరయ్యేలా ఉండాలంటూ కర్తవ్యబోధ చేశారు.

ప్రజాసంక్షేమం కోసం పాలనలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా, అవినీతికి ఏమాత్రం తావివ్వని రీతిలో పాలన ఉండాలని పేర్కొన్నారు. ఇకమీదట రాష్ట్రంలో ప్రతి టెండర్ కూడా జ్యుడిషియల్ కమిషన్ పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ గురించి హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడినట్టు ఎమ్మెల్యేలతో చెప్పారు.

ప్రతి కాంట్రాక్టు మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుందని, ఏడు రోజుల పాటు పబ్లిక్ డొమైన్ లో టెండర్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా టెండర్లో మార్పులు అవసరమని జ్యుడిషియల్ కమిషన్ సూచిస్తే, తక్షణమే మార్పులు చేస్తామని అన్నారు. ఆరోపణలు వచ్చిన టెండర్లలో రివర్స్ టెండర్ ప్రక్రియ అమలు చేస్తామని వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ లో ఎంత మిగిలిందో ప్రజలకు వెల్లడిస్తామని, పారదర్శక పాలన అందించేందుకు ఎంత చేయగలమో అంతా చేస్తామని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు అంచనాలకు మించి దోచుకున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. తమ హయాంలో అలాంటి పాలన ఉండదని తేల్చిచెప్పారు. ప్రమాణస్వీకారం నుంచే తాను పారదర్శక పాలన గురించి ఆలోచనలు చేస్తున్నానని, అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని వివరించారు. ఇక, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News