Russia: ఇనుము కోసం రైల్వే బ్రిడ్జిని ఎత్తుకుపోయిన దొంగలు
- రష్యాలో ఘటన
- 56 టన్నుల ఇనుము చోరీ
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇనుప లోహం కోసం ఏకంగా రైల్వే వంతెననే చోరీ చేసిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంబా నదిపై ఇటీవల కొత్త వంతెన నిర్మించారు. దాంతో పాత వంతెన నిరుపయోగంగా మారిపోయింది. అయితే, ఎవరూ ఉపయోగించని ఆ పాత బ్రిడ్జిపై దొంగల కన్నుపడింది. ఓ మంచి ముహూర్తం చూసుకుని రంగంలోకి దిగారు.
వంతెనలోని రెండు పిల్లర్ల మధ్య 75 అడుగుల నిడివి ఇనుము ఉండగా, దాన్ని మొత్తం కూల్చేసి ఇనుము మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. మొత్తం 56 టన్నుల ఇనుము చోరీకి గురైంది. రెండు పిల్లర్ల మధ్య ఖాళీగా కనిపిస్తుండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వర్షాలు, వరదల కారణంగా ఇది కూలిపోయి ఉంటుందని మొదట అనుకున్నా, ఆ తర్వాత అది దొంగల ఘనకార్యం అని తెలిసింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.