JC: పార్టీ మారతారా... రామ్ మాధవ్ తో చర్చలు జరిపిన జేసీ బ్రదర్స్!
- అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం
- వారసుల రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నాలు
- అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం!
రాయలసీమలో తిరుగులేని రాజకీయ కుటుంబంగా పేరు తెచ్చుకుని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపి విఫలమైన జేసీ కుటుంబం, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులు బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో చర్చలు జరిపారని, ఓ తేదీని ఖరారు చేసుకుని, ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని ఆయన అనుచరగణం అంటోంది.
ఈ విషయమై జేసీ సోదరులు ఎటువంటి అధికార ప్రకటనా చేయనప్పటికీ, అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగురవేయడం, జేసీ కుటుంబ వారసులు ఓడిపోవడంతో, తమ బిడ్డల భవిష్యత్తు కోసం దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టు సమాచారం. కాగా, జేసీ సోదరుల మాదిరిగానే మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.