Ravi prakash: విచారణకు సహకరించని రవి ప్రకాశ్.. ఇక అరెస్ట్ చేసే అవకాశం!
- మూడో రోజూ విచారణకు హాజరైన రవిప్రకాశ్
- పొంతనలేని సమాధానాలతో పోలీసులకు చుక్కలు
- అరెస్టే మార్గమని యోచిస్తున్న పోలీసులు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ మూడు రోజులుగా పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. అయితే, పొంతనలేని సమాధానాలు ఇస్తూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అరెస్ట్ కంటే ముందు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత నోటీసులు ఇచ్చి, 48 గంటల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయనిపుణులను కూడా సంప్రదించినట్టు సమాచారం.
రవిప్రకాశ్‌ను గురువారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆయనకు నోటీసు అందించి నేడు (శుక్రవారం) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. టీవీ9 లోగోను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు ఈ నోటీసు అందించారు.