Australia: ప్రపంచకప్: పోరాడి చేతులెత్తేసిన విండీస్.. ఆసీస్‌దే విజయం!
- 15 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్
- 92 పరుగులతో జట్టును గెలిపించిన కల్టర్ నైల్
- ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం
ప్రపంచకప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బిడ్జ్ వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 273 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో విజయం కాగా, విండీస్‌కు ఇది తొలి ఓటమి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. అయితే, స్టీవెన్ స్మిత్ (73), అలెక్స్ కేరీ (45), నాథన్ కల్టర్ నైల్ (92)ల అద్భుత పోరాటపటిమతో కంగారూలు అనూహ్యంగా పుంజుకున్నారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌట్ అయినప్పటీకీ 288 పరుగుల భారీ స్కోరు సాధించారు.
కొండంత విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ రెండో ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ ఎవిన్ లూయిస్ (1)ను కోల్పోయింది. 31 పరుగుల వద్ద విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (21) అవుటవడంతో కరీబియన్ల పని అయిపోయినట్టేనని అందరూ భావించారు. అయితే, షాయ్ హోప్ (68), నికోలస్ పూరన్ (40), కెప్టెన్ జాసన్ హోల్డర్ (51)లు తెగువ చూపడంతో ఒకానొక దశలో విండీస్ విజయం దిశగా పరుగులు తీసింది.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో విండీస్ ఓటమి ఖరారైంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు మాత్రమే చేసి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 92 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కల్టర్ నైల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.