Jayashankar Bhupalpally District: పేదింట ప్రతిభా కుసుమం...టైలర్ కుమారుడికి నీట్ లో జాతీయ స్థాయి 55వ ర్యాంకు
- తల్లి కష్టాన్ని గుర్తించిన తనయుడు
- ఉన్నత ర్యాంకు సాధన దిశగా కృషి
- బిడ్డ సాధించిన ఘనత చూసి మురిసిపోతున్న తల్లి
రెక్కలు ముక్కలు చేసుకుని తల్లి కష్టపడుతూ తెచ్చిన రూపాయి రూపాయి తన చదువు కోసం ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తించిన బిడ్డ అందుకు తగిన ప్రతిఫలాన్నే ఆమెకు అందించాడు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 55వ ర్యాంకు సాధించి ఆమె కలల పంటయ్యాడు.
వివరాల్లోకి వెళితే...జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఎంపటి కుశ్వంత్ నిన్న ప్రకటించిన నీట్ ఫలితాల్లో 55వ ర్యాంకు సాధించి పాఠశాలకి, జిల్లాకు, రాష్ట్రానికి పేరు తెచ్చాడు. భూపాలపల్లికి చెందిన అనిత, లక్ష్మీనారాయణ దంపతులకు కుశ్వంత్, శ్రీకర్ ఇద్దరు కొడుకులు. దర్జీ (టైలర్)లుగా పనిచేసి జీవనోపాధి పొందే దంపతులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో నివాసం ఉండేవారు.
అయితే, తొమ్మిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీనారాయణ మృతి చెందాడు. దాంతో ఒక్కసారిగా అనిత జీవితంలోకి చీకటి తొంగిచూసింది. అయినా ఆమె స్థైర్యం కోల్పోలేదు. వృత్తినే నమ్ముకుని పిల్లల్ని చదివించి తీర్చిదిద్దాలనుకుంది. భూపాలపల్లిలో బంధువులు ఉండడం వల్ల అక్కడికి వెళ్లిపోతే వారి సాయం కూడా తోడవుతుందని పిల్లలతోపాటు అక్కడికి మకాం మార్చింది.
కుశ్వంత్ బాల్యం నుంచి మెరిట్ విద్యార్థి. శ్రీకర్ కూడా బాగానే చదువుతాడు. దీంతో పిల్లలకు మంచి చదువు చదివించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. తల్లి కష్టాన్ని ప్రతి రోజూ కళ్లారా చూసే కుశ్వంత్ ఆ కష్టాన్ని వృథా కానివ్వకూడదని మరింత కష్టపడ్డాడు. భూపాలపల్లిలోని మాంటిస్సోరి పాఠశాలలో చదివి పదో తరగతిలో 10/10 మార్కులు సాధించాడు. హైదరాబాద్ లోని చైతన్య జూనియర్ కళాశాలలో బైపీసీ చదివి 982 మార్కులు సాధించాడు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ రాశాడు. 55వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఏపీ ఎంసెట్లోనూ కుశ్వంత్ టాప్-10లో మార్కులు సాధించడం గమనార్హం. కాగా, కుశ్వంత్ తమ్ముడు శ్రీకర్ పదో తరగతి చదువుతున్నాడు.