england: ఇంగ్లండ్‌లో అత్యాచారం చేసి భారత్ పారిపోయి వచ్చిన నిందితుడు
- అతడిని పట్టించిన ఇయర్‌ఫోన్స్
- ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సాక్ష్యాలు
- ఏడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
ఇంగ్లండ్‌లో ఓ యువతిపై అత్యాచారం చేసి తప్పించుకునేందుకు భారత్ పారిపోయి వచ్చిన నిందితుడిని అతని ఇయర్‌ఫోన్స్ పట్టిచ్చాయి. ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయం రుజువు కావడంతో కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు...తూర్పు ఇంగ్లండ్‌లోని లోవెస్టాప్ట్ టౌన్‌లో నివసించే 35 ఏళ్ల అజయ్‌రాణా 2017 డిసెంబరు 9న లిప్ట్ ఇస్తానంటూ ఓ యువతిని కారెక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లాక ఆ యువతిపై కారులోనే అత్యాచారం చేశాడు.
అనంతరం ఏమీ తెలియనట్టు తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి ఇండియా వచ్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై ఇంగ్లండ్ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు. విచారణలో అతను ఉపయోగించిన కారు రూమ్మేట్స్‌దని తేలింది. కారులో నుంచి సంఘటన సమయంలో అతను ఉపయోగించిన ఇయర్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రాణా కారు వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాల ఆధారంగా అతనిపై బలమైన సాక్ష్యాలు సంపాదించారు. వీటి ఆధారంగా రాణాను ప్రాథమికంగా నిందితుడిగా నిర్థారించి ముందు అతనిపై యూరోపియన్ అరెస్టు వారెంటు జారీ చేశారు. గత అక్టోబర్‌లో ఇండియా నుంచి యూరోప్ వచ్చిన రాణాను అదుపులోకి తీసుకున్నారు. ఫొరెన్సిక్ రిపోర్టు, డీఎన్‌ఏ టెస్ట్ నివేదికతో రాణాను న్యాయస్థానం ముందు నిబెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన సపోల్క్ కోర్టు నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.