Hyderabad: హైదరాబాద్ లో నాలుగు రోజుల్లో 77 అదృశ్యం కేసులు... అమ్మాయిలే అధికం!
- 19 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతుల అదృశ్యం
- ఉత్తరాది యువకులే అత్యధిక కేసుల్లో నిందితులు
- తెలంగాణలోని మిస్సింగ్ కేసుల్లో సగం గ్రేటర్ పరిధిలోనే
ఈ నెలలో తొలి నాలుగు రోజుల్లో హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ లలో 77 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో అత్యధికులు వయసులో ఉన్న అమ్మాయిలే కావడం గమనార్హం. 1వ తేదీన హైదరాబాద్ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 8, రాచకొండ పరిధిలో 10 కేసులు నమోదుకాగా, 2వ తేదీన 10, 14, 7, మూడున 1, 1, 2, నాలుగున 5, 2, 4 కేసులు నమోదయ్యాయి.
ఆకర్షణ, ప్రేమ మాయలో పడుతున్న అమ్మాయిల కేసులు వీటిల్లో అత్యధికంగా ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చిన ఉత్తరాది యువకులే అత్యధిక కేసుల్లో నిందితులుగా ఉంటున్నారని అంటున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, తమంతట తాముగా గడప దాటుతున్నారని తమ విచారణలో తేలుతోందని పోలీసులు చెబుతున్నారు.
వివాహమైన యువతులు సైతం భర్త నుంచి కోరుకున్న ప్రేమ లభించక, తమకు పరిచయం అయ్యే యువకుల పట్ల ఆకర్షితులవుతున్నారని, కొన్ని కేసుల్లో అత్తింటి హింసను భరించలేక పారిపోయిన ఉదంతాలు వెలుగు చూశాయని అన్నారు. కన్నవారి ఆదరణ లేక కనిపించకుండా పోతున్న వృద్ధుల సంఖ్య కూడా కనిపిస్తోందని తెలిపారు.
ఇదిలావుండగా, ఈ నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 144 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ కాగా, అందులో సగం గ్రేటర్ పరిధిలోనే ఉండటం గమనార్హం. అదృశ్యమైన మహిళల కేసుల్లో 19 నుంచి 30 ఏళ్ల వయసున్నవారే అధికమని తెలుస్తోంది. తమ వద్దకు కేసు రాగానే తీవ్రతను బట్టి స్పందిస్తున్నామని, అపహరణకు గురైనట్టు అనుమానం వస్తే మాత్రం వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నామని ఉన్నతాధికారులు అంటున్నారు.