Tamilnadu: ఒక్కో కిడ్నీకి రూ. 3 కోట్లు ఇస్తామంటే నమ్మేసి మోసపోయిన 500 మంది!
- తమిళనాడులో కిడ్నీల పేరిట మోసం
- రిజిస్ట్రేషన్ కోసం రూ. 25 వేల వరకూ చెల్లించిన బాధితులు
- హైదరాబాద్ ముఠా కారణమని అనుమానం
ఎవరైనా కిడ్నీ దాతలుంటే రూ. 3 కోట్లు ఇస్తామని ఫేస్ బుక్ లో విస్తృతంగా ప్రచారమైన ఓ ప్రకటనను చూసిన 500 మంది దారుణంగా మోసపోయారు. పెద్ద మొత్తం డబ్బును ఆఫర్ చేయడంతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పేదలు క్యూ కట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ. 25 వేల వరకూ వసూలు చేసిన మాయగాళ్లు, ఆపై పత్తా లేకుండా వెళ్లారు. తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈరోడ్ లో కల్యాణి కిడ్నీ కేర్ సెంటర్ ఉండగా, దాని పేరుతో ఫేస్ బుక్ లో మూడు నెలల క్రితం ఓ ప్రకటన వెలువడింది.
ఒక కిడ్నీ ఇస్తే, రూ. 3 కోట్లు ఇస్తామని, ఆసక్తి ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ఆ ప్రకటన సారాంశం. దీన్ని చూసిన ఎంతో మంది రిజిస్ట్రేషన్ కోసం ముందుకు రాగా, వారి నుంచి అందినకాడికి దోచుకున్నారు. ఈరోడ్, సేలం, నామక్కర్, కరూర్, కోయంబత్తూర్, తిరుచ్చి ప్రాంతాలకు చెందిన ఎంతో మంది మోసపోయారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.
ఇక రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కల్యాణి కిడ్నీ కేర్ సెంటర్ ను బాధితులు సంప్రదించగా, ఆ ప్రకటన తమది కాదని తేల్చి చెప్పడంతో అవాక్కయ్యారు. ఈ వ్యవహారంపై కల్యాణి కిడ్నీ కేర్ సెంటర్ ఎండీ ఈరోడ్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో, కేసు నమోదు చేయగా, రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లనూ అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ముఠా హస్తం దీని వెనుక ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.