Bhopal: వారానికోసారి న్యాయస్థానం ఎదుట హాజరు కావాల్సిందే: సాధ్వి ప్రజ్ఞకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం
- మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి నిందితురాలు
- మినహాయింపు కుదరదన్న కోర్టు
- నిందితులంతా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు
మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు, భోపాల్ ఎంపీ స్వాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ముంబైలోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు షాకిచ్చింది. వారానికోసారి కోర్టు ఎదుట హాజరు కావాల్సిందేనంటూ న్యాయమూర్తి వినోద్ పదాల్కర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ మేరకు న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారు కూడా కోర్టుకు ప్రతి వారం హాజరు కావాల్సిందేనని పదాల్కర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
29 సెప్టెంబరు 2008న మహారాష్ట్రలోని మాలెగావ్‌లో బైక్ బాంబు పేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు ఉపయోగించిన బైక్ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ది కావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితులు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. సోమవారం జరిగిన విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. మిగతా నలుగురు సోమవారం నాటి విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.