mahatma Gandhi: గాంధీని హత్య చేసిన గాడ్సేకు కృతజ్ఞతలు తెలిపిన ఐఏఎస్ అధికారిణిపై వేటు
- మహాత్మాగాంధీపై వివాదాస్పద ట్వీట్ చేసిన నిధి చౌదరి
- బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు
మహాత్మాగాంధీని అవమానిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసిన మహారాష్ట్ర ఐఏఎస్ అధికారిణి, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ కమిషనర్ నిధి చౌదరిపై వేటు పడింది. ఆమె ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆమెను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను కూల్చివేయాలని, కార్యాలయాల్లో ఉన్న ఆయన ఫొటోలను తొలగించాలని, కరెన్సీ నోట్లపై నుంచి ఆయన ఫొటోను తొలగించాలంటూ నిధి చౌదరి ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా గాంధీని హత్య చేసిన గాడ్సేకు కృతజ్ఞతలు చెప్పారు. ఆమె ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. నెటిజన్ల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో నిధి వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.
విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన నిధి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి వివరణ ఇచ్చారు. తాను కావాలనే వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. గాంధీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని అన్నారు. వీటిని చూసి బాధపడే అవకాశం గాంధీకి ఇవ్వకుండా గాడ్సే చంపేశాడని, అందుకే కృతజ్ఞతలు చెప్పానని వివరించారు.
వివరణ ఎలా ఉన్నా గాంధీని అవమానించేలా ట్వీట్ చేసిన నిధిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆమెను బీఎంసీ నుంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.