India: ఎయిర్ ఇండియా విమానం డోర్ కు రంధ్రం... ల్యాండైన తర్వాత గుర్తింపు

  • శబ్దం వినిపించిందంటున్న కొందరు ప్రయాణికులు
  • అదేమీ లేదంటున్న ఎయిరిండియా
  • రిటర్న్ ఫ్లయిట్ రద్దు

ఎయిరిండియాకు చెందిన బోయింగ్-777 విమానం డోర్ కు రంధ్రం ఉన్నట్టు గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన ఈ విమానం ల్యాండైన తర్వాత సాధారణ తనిఖీల్లో భాగంగా ఎగ్జిట్ డోరుకు కిందిభాగంలో రంధ్రం ఉన్నట్టు గుర్తించారు. అంతకుముందు, ఆ విమానం సురక్షితంగానే కిందికి దిగింది. రంధ్రం కారణంగా విమానం క్యాబిన్ పై పెద్దగా ఒత్తిడి పడలేదని తనిఖీల్లో వెల్లడైంది.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇది నాన్ స్టాప్ ఫ్లయిట్. అత్యధిక దూరం ప్రయాణించాల్సిన విమాన మార్గాల్లో ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో రూట్ కూడా ఉంది. పసిఫిక్ మహాసముద్రం మార్గంలో ప్రయాణించే ఈ లాంగ్ రేంజ్ ప్లేన్ 15.5 గంటల పాటు ఏకంగా 15,000 కిలోమీటర్లు పయనిస్తుంది. రంధ్రం కారణంగా ప్రయాణంలో ఎక్కడా సమస్య రాకపోవడం ప్రయాణికుల అదృష్టమనే చెప్పాలి.

  కాగా, విమానం ప్రయాణిస్తుండగా 'స్స్' అంటూ గాలి రొద వినిపించిందని కొందరంటున్నా, ఎయిరిండియా వర్గాలు మాత్రం అదేమీలేదంటున్నాయి. మొత్తమ్మీద విమానానికి డ్యామేజ్ అయిందన్నది వాస్తవం అని, ఇది ఎలా జరిగిందన్నది తెలుసుకుంటామని ఎయిరిండియా ఇంజినీరింగ్ సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో, తిరిగి ఢిల్లీ రావాల్సిన రిటర్న్ ఫ్లయిట్ ను రద్దుచేశారు. దాంతో కొందరు ప్రయాణికులు ఇతర విమానాల్లో వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News