Hindi: నూతన విద్యా విధానంపై... మెట్టుదిగిన మోదీ సర్కారు!
- అన్ని భాషలనూ గౌరవిస్తాం
- హిందీని తప్పనిసరి చేసే ఆలోచన లేదు
- స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జైశంకర్
హిందీ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో మోదీ సర్కారు మెట్టు దిగింది. తమపై బలవంతంగా భాషను రుద్దితే ప్రతిఘటన తప్పదని పలు రాష్ట్రాల రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రచయితలు హెచ్చరించడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని నూతన విద్యా విధానానికి సవరణలు చేస్తామని అన్నారు.
అన్ని భాషలనూ కేంద్రం గౌరవిస్తుందని, ఎవరిపైనా హిందీని రుద్దాలని భావించడం లేదని అన్నారు. కాగా, 2014లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు కొత్త విద్యా విధానం కోసం ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలో 9 మందితో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేయగా, ఈ కమిటీ ఇటీవలే తన నివేదికను కేంద్రానికి ఇచ్చింది. దీంతో ఆరో తరగతి నుంచి నిర్బంధ హిందీని ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించగా, పలు రాష్ట్రాలు తీవ్రంగా స్పందించాయి.