BJP: బీజేపీ వెబ్ సైట్లో బీఫ్ వేపుడు... హ్యాకర్ల పనితనం!
- ఢిల్లీ బీజేపీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వ్యక్తులు
- వెబ్ సైట్లో బీఫ్ వంటకాల జాబితా
- ఫ్రాన్స్ సైబర్ నిపుణుడు చెప్పడంతో వెలుగులోకి వచ్చిన విషయం
గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా గొడ్డుమాంసం ఎంతో చర్చనీయాంశం అయింది. బీఫ్ తినడంపై కొన్ని వర్గాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, తాజాగా బీజేపీ ఢిల్లీ విభాగం వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన కొందరు వ్యక్తులు ఆ వెబ్ సైట్లో బీఫ్ వంటకాల జాబితాను ఉంచారు. బీఫ్ ఫ్రై అంటూ ఫొటోలతో సహా ప్రదర్శించారు.
షాడో వీఐపీ3ఆర్ అనే పేరుతో ఢిల్లీ బీజేపీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అందులో బీఫ్ కర్రీ, బీఫ్ వేపుడు వంటి పలు వంటకాలు కనిపించాయి. పలు పేజీల్లో బీఫ్ చరిత్ర, బీఫ్ లో వెరైటీల గురించి వివరించారు. ఫ్రాన్స్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఎలియట్ ఆల్డర్సన్ చెప్పడంతో బీజేపీ వర్గాలు తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించాయి. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ సైబర్ నిపుణులు వెబ్ సైట్ ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.