BJP: ఎన్డీయేలో వైసీపీ చేరుతోందన్న వార్తల్లో నిజంలేదు: కన్నా
- అవన్నీ కల్పిత కథనాలే
- ఏపీలో ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుంది
- ఈ నెల 9న మోదీ రాష్ట్రానికి వస్తున్నారు
అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, సంఖ్యాబలం దృష్ట్యా వైసీపీకి కేంద్రంలో కూడా సముచిత స్థానం దక్కే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. వీటిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు.
ఎన్డీయే సర్కారులో వైసీపీ చేరుతోందంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. అవన్నీ కల్పిత కథనాలే అని తేల్చిచెప్పారు. తాము ఏపీలో కూడా ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. అంతేగాకుండా, పోలవరం ప్రాజక్టుపైనా ఆయన స్పందించారు. పోలవరం ప్రాజక్టును కేంద్రం నిర్మించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9న రాష్ట్రానికి రానున్నారని, తిరుమల వెంకన్నను దర్శించుకుంటారని కన్నా పేర్కొన్నారు.