lovers: పెళ్లి చేసుకున్న రాత్రే ముఖం చాటేసి పారిపోయిన వరుడు...పోలీసులను ఆశ్రయించిన వధువు
- ఫోన్ చేస్తే విడాకులు తీసుకుందామని ప్రతిపాదన
- ప్రేమించి సహజీవనం చేశాక పెళ్లికి నిరాకరణ
- పోలీసులను ఆశ్రయించి పెళ్లాడినా దక్కని ఫలితం
ప్రేమ బాసలు చేశాడు. ఆమె కష్టార్జితాన్ని కొల్లగొట్టి జల్సాలు చేశాడు. సహజీవనం చేసి శారీరక అవసరాన్ని తీర్చుకున్నాడు. తీరా పెళ్లి సమయానికి ముఖం చాటేశాడు. అయినా పట్టువదలని సదరు యువతి పోలీసుల సాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నా అదే రోజు రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసి అడిగితే విడాకులు తీసుకుందామని ప్రతిపాదిస్తున్నాడు. సినిమాలాంటి ట్విస్ట్‌లతో సాగిన ఈ ప్రేమకథకు సంబంధించి బాధితురాలు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇవీ.
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో నివసించే ఓ యువతి (23) 2016లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో సహ రచయితగా పనిచేస్తున్న విశాఖ వాసి రమణగౌతమ్ (28)తో పరిచయం అయ్యింది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. సినిమాలు వద్దని చెప్పడంతో సదరు యువతి ఆ ప్రయత్నాలు మానుకుంది. ఆ తర్వాత సోదరుడి వరుసయ్యే వ్యక్తితో కలిసి గల్ఫ్ వెళ్లింది. అక్కడ సంపాదించిన దాంట్లో రూ.2.5 లక్షలు ఖర్చుపెట్టి ప్రియుడికి ఉంగరం, వాచీ, ఐఫోన్ కొనిపెట్టింది. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాక ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఆ తర్వాత ఆమె సింగపూర్ వెళ్లింది. అక్కడ కొన్నాళ్లు పనిచేశాక బహరిన్ వెళ్లింది. ఈ సందర్భంలో సంపాదించిన దాదాపు రూ.5 లక్షలు గౌతమ్‌కు ఇచ్చింది. తిరిగి వచ్చాక ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇటీవల సదరు యువతి పెళ్లి ప్రస్తావన తేవడంతో గౌతమ్ ససేమిరా అన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘటన అనంతరం పోలీసులు గౌతమ్‌ను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. పెళ్లికి అంగీకరించడంతో ఆదివారం సమీపంలోని దేవాలయంలో ఇద్దరికీ పెళ్లి చేశారు.
వివాహం అనంతరం ఎన్‌బీటీ నగర్‌లోని యువతి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి బయటకు వెళ్లిన గౌతమ్ తిరిగి ఇంటికి రాలేదు. పలుమార్లు ఫోన్ చేయగా రెండురోజుల క్రితం స్పందించిన గౌతమ్ విడాకులు తీసుకుందామని ప్రతిపాదించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో శుక్రవారం బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. అతనికి ఇదివరకే చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందంటూ పోలీసులకు పలు చిత్రాలు అందించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.