Rajasthan: కబీర్ శర్మగా పరిచయం చేసుకుని బ్రాహ్మణ యువతిని పెళ్లాడిన ముస్లిం యువకుడు.. సినిమా స్టోరీని మరిపించే మలుపులు!
- తనను తాను బ్రాహ్మణ యువకుడిగా పరిచయం
- ఒక్కగానొక్క కుమార్తెకు ఘనంగా పెళ్లి చేసిన యువతి తండ్రి
- రూ.11 లక్షల కట్నం.. రూ.5 లక్షల విలువైన బంగారు నగలు
- రెండు రోజులకే అదనపు కట్నం కోసం డిమాండ్
కబీర్ శర్మ పేరుతో హిందూ యువతిని పెళ్లాడి భారీగా కట్నం తీసుకుని, ఆపై అదనపు కట్నం డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు కూడా చేతికందాక ఇద్దరూ కలిసి అదృశ్యమయ్యారు. రాజస్థాన్‌లో శికర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది.
ఇమ్రాన్ భాటీ అనే వ్యక్తికి ఇది వరకే పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల ఒక సందర్భంలో బాధిత యువతికి ఇమ్రాన్ భాటీ తనను తాను కబీర్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆమె తల్లిదండ్రులను కలసి.. తాను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినంటూ మాటలు కలిపాడు. తనకింకా పెళ్లి కాలేదని, మీకు ఇష్టమైతే వారి కుమార్తెను పెళ్లాడతానంటూ నమ్మించాడు.
అతడి అతి వినయానికి నమ్మేసిన బాధిత యువతి కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో మే13న జైపూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిగింది. నిశ్చితార్థ కార్యక్రమంలో తన తల్లిదండ్రులు, బంధువులంటూ నకిలీ వ్యక్తులను భాటీ పరిచయం చేశాడు. వారు తమ గోత్రాన్ని కూడా సరిగ్గానే చెప్పడంతో వారిని పూర్తిగా నమ్మేశానని బాధిత యువతి తండ్రి పేర్కొన్నారు.
వివాహమైన కొన్ని రోజులకే తన కుమార్తెను ఇంటికి పంపి రూ.5 లక్షలు ఇచ్చి పంపించాలని డిమాండ్ చేశాడని ఆమె తండ్రి బావురుమన్నారు. దీంతో ఏదో తంటాలు పడి రూ.2.5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చి కుమార్తెను పంపానని పేర్కొన్నారు. అయితే అలా వెళ్లిన తన కుమార్తె, అల్లుడు మే 17 నుంచి కనిపించడం లేదని, తన ఇంట్లోని బంగారం కూడా మాయమైందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుమార్తె, అల్లుడు కనిపించకపోవడంతో పెళ్లి ఫొటోలు తీసుకుని జైపూర్ వెళ్లిన ఆయన అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అతడి అసలు పేరు ఇమ్రాన్ భాటీ అని, అతడికి ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో విస్తుపోయారు. విషయం పోలీసులకు చెబితే వారు కూడా షాకయ్యారు.
తనకు ఒక్కర్తే కుమార్తె అని, దీంతో రూ.11 లక్షల కట్నం, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు పెట్టి ఘనంగా పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన జంట కోసం గాలిస్తున్నారు. పెళ్లికి వచ్చినవారు, కుటుంబ సభ్యులుగా పరిచేయం చేసిన వారు, చివరికి ఫొటోగ్రాఫర్లు కూడా అందరూ నకిలీలేనని పోలీసులు నిర్ధారించారు. అయితే, బాధిత కుటుంబ సభ్యుల్లో కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీయడంతో అవే ఆధారంగా మిగిలాయి.