Andhra Pradesh: ఈ మామిడికాయ భారీ గురూ.. బరువు మూడున్నర కిలోలు!
- ఏనుగుతొండం రకానిదిగా గుర్తింపు
- అరుదైన విషయమన్న ఉద్యానవన శాఖ ఏడీ
- తూర్పుగోదావరి జిల్లా మడికి మార్కెట్లో ఆకట్టుకున్న భారీ మామిడి
మామిడికాయ బరువు ఎంత ఉంటుంది? ఎంత పెద్దదైనా మహా అయితే రెండు కిలోల వరకు ఉంటుందేమో! కానీ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మడికి కూరగాయల మార్కెట్లో అందరినీ ఆకట్టుకున్న ఈ మామిడికాయ బరువు మాత్రం ఏకంగా మూడున్నర కిలోలు. రాజానగరం మండలం తుంగపాడుకు చెందిన మామిడి రైతు కొత్తపల్లి శ్రీను తోటలో కాసింది ఇది. శుక్రవారం దీనిని మార్కెట్‌కు తీసుకురాగా కొనుగోలు చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. చివరికి స్థానిక వ్యక్తి ఒకరు రూ.200కు కొనుగోలు చేశాడు. ఇది ఏనుగుతొండం రకానికి చెందినదని రాజమహేంద్రవరం ఉద్యానవన శాఖ ఏడీ ఆర్.దేవానందకుమార్ తెలిపారు. సాధారణంగా ఈ రకం కాయలు కిలోన్నర వరకు పెరుగుతాయని, కానీ మూడున్నర కిలోల బరువు ఉండడం అరుదైన విషయమని పేర్కొన్నారు.