Jagan: జూన్ 8న ఏపీలో మంత్రుల పదవీప్రమాణస్వీకారం... కూర్పుపై జగన్ కసరత్తు!
- ముఖ్యనేతలతో చర్చించిన జగన్
- ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గంలో చోటు!
- జూన్ 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
ఏపీలో కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన మొదలుపెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు. మంత్రివర్గం ఎలా ఉండాలి? ఎవరికి స్థానం కల్పించాలి? అనే అంశాలపై జగన్ వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారు. ఈ సమావేశంలో నూతన క్యాబినెట్ పదవీప్రమాణస్వీకారానికి తగిన ముహూర్తం గురించి కూడా చర్చ జరిగింది.
ఈ మేరకు కొత్త క్యాబినెట్ కొలువుదీరేందుకు జూన్ 8 ముహూర్తంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజున మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మంచి రోజు కావడంతో జగన్ కూడా జూన్ 8న ఏపీ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 9 గంటల లోపు తన చాంబర్ లో ప్రవేశించనున్నారు.
కాగా, తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. క్యాబినెట్ ఏర్పాటు పూర్తయ్యాక జూన్ 15న గానీ, లేక ఆ తర్వాత గానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.