Chandrababu: "ఊళ్లల్లో ఉండలేమయ్యా..." అంటూ మొరపెట్టుకున్న మహిళలకు చంద్రబాబు ఓదార్పు!

  • ఎప్పుడు ఏం జరుగుతుందో 
  • భయపడుతున్నామన్న చిత్తూరు జిల్లా మహిళలు
  • అండగా ఉంటానని చంద్రన్న భరోసా

ఓటమికి కుంగిపోవద్దని, అధైర్యపడితే మరింతగా నష్టపోతామని, తన వద్దకు వచ్చిన పలువురు చిత్తూరు జిల్లా మహిళలను చంద్రబాబు ఓదార్చారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎక్కువగా ఇంటికే పరిమితమైన చంద్రబాబు, నిత్యమూ తనను కలిసేందుకు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్న చంద్రబాబు, వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మహిళలు, చంద్రబాబును కలిసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. తామంతా ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశామని, ఫలితాలు ఇలా రావడం ఏంటని అన్నారు. తాము ఊళ్లలో ఉండలేకపోతున్నామని, ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిగిన సమయంలో బెదిరింపులను చూశామని వారు చెబితే, తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కాగా, టీడీపీ పరాజయంపై 4వ తేదీ నుంచి చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. తొలుత విజయవాడ లోక్ సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన వారిని పిలిచి ఓటమికి కారణాలను అడిగి తెలుసుకోనున్నారు.

  • Loading...

More Telugu News