Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను... పూర్తయిన ప్రమాణ స్వీకారం!

  • కొత్త సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
  • ఆపై రహస్య ప్రమాణ స్వీకారం
  • బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం, రహస్య పరిరక్షణ ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12.23 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, జగన్ తో ప్రమాణం చేయించారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం పూర్తవగానే జగన్ వేదికపైనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం పెట్టారు. ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్, స్టాలిన్ తదితరులతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు.

"వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయతా చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని ప్రమాణం చేశారు.

ఆపై "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని రహస్య పరిరక్షణ ప్రమాణం చేసి, ఆపై సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంతకం చేశారు.

Jagan
Vijayawada
CM
Governer
Oath
  • Loading...

More Telugu News