Andhra Pradesh: వైఎస్ గెలవగానే ‘వర్షాల సీఎం’ అనేవారు.. సరిగ్గా జగన్ ప్రమాణస్వీకారానికి ముందు వర్షం కురిసింది!: నటుడు అలీ
- జగన్ గెలుపుకోసం ఐదుకోట్ల ఆంధ్రులు ఎదురుచూశారు
- వైఎస్ తరహాలో జగన్ కు ప్రజామోదం లభించింది
- విజయవాడలో మీడియాతో వైసీపీ నేత
ఏపీలో ఐదు కోట్ల ఆంధ్రులు జగన్ విజయం కోసం ఎదురుచూశారని వైసీపీ నేత, నటుడు అలీ తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రిగా ఎంత ప్రజామోదం లభించిందో, వైఎస్ జగన్ కు అదే స్థాయిలో ప్రజల నుంచి స్వాగతం లభించిందనీ, ఇది సామాన్యమైన విషయం కాదని వ్యాఖ్యానించారు. తన తొలి సంతకాన్ని జగన్ నవరత్నాలపై చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్న అలీ మీడియాతో మాట్లాడారు.
కొత్తింటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో, కొత్త రాష్ట్రం, కొత్త అమరావతికి నవరత్నాలు అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఏపీలో 151 సీట్లను జగన్ సాధించడం మామూలు విషయం కాదనీ, అదో మిరాకిల్ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
‘వైఎస్ గెలవగానే వర్షాల సీఎం అనేవారు. ఇక జగన్ ప్రమాణస్వీకారానికి ముందే వర్షం కురిసింది. జగన్ నాయకత్వంలో ఏపీ హరితాంధ్రప్రదేశ్ అవుతుందని ఆశిస్తున్నా. సాధారణంగా మైనారిటీలు సాయంత్రం ఐదుకు వచ్చి ఓటేసేవారు. కానీ జగన్ మీద అభిమానంతో ఈసారి రాత్రి ఒంటి గంట వరకూ క్యూలైన్లలో నిలబడి మరీ ఓటేశారు. వైసీపీకి సహకరించిన మైనారిటీలు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’ అని పేర్కొన్నారు.