Visakhapatnam District: స్వరూపానంద దర్శనం కోసం... పెందుర్తి శారదా పీఠానికి వైసీపీ నేతల క్యూ!
- పీఠాధిపతి స్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీర్వచనం
- ఎన్నికల ముందు స్వామిని దర్శించుకున్న జగన్
- విజయం సాధించడంతో సెంటిమెంట్‌గా మారిన వైనం
విశాఖ జిల్లా పెందుర్తిలోని శారదా పీఠం అధికార వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కిటకిటలాడుతోంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శనానికి ప్రజాప్రతినిధులు బారులుతీరుతున్నారు. జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు రావడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించి స్వామి ఆశీర్వచనం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆయన స్వరూపానందేంద్రను కలవడం, మాట్లాడడం చేశారు. ఎన్నికల ముందు జగన్ గెలుపు కోసం వైసీపీ నేతలు స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజాశ్యామల యాగం కూడా నిర్వహించారు. ఫలితాలు పాజిటివ్‌గా రావడం, రాష్ట్రంలో వైసీపీ ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు శారదా పీఠం పార్టీ నాయకులకు సెంటిమెంట్‌గా మారింది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వరూపానందేంద్ర ఆశీర్వాదం తీసుకున్నారు. పీఠాన్ని దర్శించుకున్న వారిలో ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ (విశాఖ), సత్యవతి(అనకాపల్లి), ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి), మద్ది వేణుగోపాల్(దర్శి), ఉదయభాను సామినేని(జగ్గయ్యపేట), శంబంగి వెంకట చిన అప్పలనాయుడు(బొబ్బిలి)ఉన్నారు.
అలాగే తిప్పల నాగిరెడ్డి(గాజువాక), గొల్ల బాబూరావు(పాయకరావుపేట), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (భీమిలి), తమ్మినేని సీతారాం(ఆముదాలవలస), గుడివాడ అమర్‌నాథ్(అనకాపల్లి), బి.ముత్యాలనాయుడు(మాడుగుల), కారుమూరి వెంకట నాగేశ్వరరావు(తణుకు), అన్నంరెడ్డి అదీప్‌రాజ్(పెందుర్తి), కరణం ధర్మశ్రీ(చోడవరం), కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్), ఆర్థర్(నందికొట్కూరు), కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం), కొట్టగుళి భాగ్యలక్ష్మీ(పాడేరు), చెట్టి ఫల్గుణ(అరకు), అన్నా వెంకటరాంబాబు(గిద్దలూరు) తదితర ఎమ్మెల్యేలు కూడా స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.