Telangana: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేసీఆర్, నేను కలిసి పని చేస్తాం: వైఎస్ జగన్
- తెలుగు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహబంధం బలపడింది
- పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి
- ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని కేసీఆర్ చెప్పారు
తెలంగాణ సీఎం కేసీఆర్ ను వైసీపీ అధినేత జగన్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఏపీ భవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ, నిన్న కేసీఆర్ తో తన భేటీ గురించి ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహబంధం బలపడిందని, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలని, పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణతో స్నేహ సంబంధం అవసరమని చెప్పారు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని కేసీఆర్ ఒక అడుగు ముందుకేశారని, విభజన హామీలను కలిసి సాధిద్దామని ఆయన ముందుకొచ్చారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై టీఆర్ఎస్ ఎంపీలు ఏపీతోనే ఉంటారని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని, తెలుగు రాష్ట్రాల సమస్యలపై 31 మంది ఎంపీలు కలిసి నడుస్తామని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేసీఆర్, తాను కలిసి పనిచేస్తామని చెప్పారు.