Australia: 'చనిపోయిన భర్త'తో ప్రపంచ విహారం చేస్తున్న మహిళ
- చర్మ క్యాన్సర్ తో చనిపోయిన భర్త
- భర్త నిలువెత్తు కటౌట్ తో భార్య ప్రయాణాలు
- అనేక ప్రదేశాల సందర్శన
ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్లీ బౌర్క్ ది ఓ విచిత్రమైన పరిస్థితి! మిచెల్లీ వయసు 58 సంవత్సరాలు. ఆమె భర్త పేరు పాల్. అతనో హెవీ ట్రక్ డ్రైవర్. అయితే, పాల్ కొన్నాళ్ల క్రితం చర్మ క్యాన్సర్ తో మృతిచెందాడు. చివరిదశలో ఉన్నప్పుడు పాల్ తన భార్యతో మాట్లాడుతూ, నేను చనిపోయిన తర్వాత ఏంచేస్తావు? అని అడిగాడు. అందుకామె, మీ ఫొటో పక్కన ఉంచుకుని ప్రపంచంలోని అనేక పర్యాటక స్థలాలకు వెళతాను అని బదులిచ్చింది. మీ ఫొటో ఉంటే మీరు పక్కన ఉన్నట్టే ఉంటుంది అని చెప్పింది.
ఈ సంభాషణ జరిగిన కొన్నాళ్లకు పాల్ కన్నుమూశాడు. అయితే భర్తతో చెప్పిన మాటలను మిచెల్లీ నిజం చేసింది. భర్తది నిలువెత్తు కటౌట్ తయారుచేయించి దాన్ని తన పక్కనే ఉంచుకుని ప్రపంచంలోని అనేక దర్శనీయ స్థలాలకు వెళ్లింది. ఆఫ్రికన్ గ్రాండ్ కాన్యాన్, ఈఫిల్ టవర్, బకింగ్ హామ్ ప్యాలస్, ఫుకెట్, న్యూయార్క్ తదితర ప్రాంతాలను సందర్శించింది.
పాతికేళ్ల తమ దాంపత్య జీవితంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలనుకునేవాళ్లమని, ఇప్పుడిలా అతడి బొమ్మతో విహారయాత్రలు చేయాల్సి వస్తోందని మిచెల్లీ వివరించింది. ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే మిచెల్లీ మంచి రచయిత కూడా. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అన్నట్టు, పాల్ మొదటి భార్యను, ఆమె ఇద్దరు కుమారులను కూడా మిచెల్లీనే సంరక్షిస్తోంది.