counting day: ఫలితాల రోజు టీవీలకే అతుక్కుపోయిన జనం...గిరగిరా తిరిగిన విద్యుత్ మీటర్లు
- హైదరాబాద్ నగరంలో ఒకేరోజు 68.95 మిలియన్ యూనిట్ల వినియోగం
- ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా పనిచేయడమే కారణం
- ఠారెత్తించిన ఎండ ప్రభావం కూడా
అసలే ఎండ మండిపోతోంది. పైగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు. తెలంగాణ ప్రభుత్వం కౌంటింగ్ రోజును ఏకంగా సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఇంకేం, జనం ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీలకు అతుక్కుపోయారు. రోజంతా టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు నిరంతరాయంగా పనిచేశాయి. దీంతో విద్యుత్ మీటర్లు గిరగిరా తిరిగాయి. ఎంతలా అంటే ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఈనెల 23వ తేదీన 68.95 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని లెక్కకట్టారు.
సాధారణంగా హైదరాబాద్‌లో ఆల్‌టైమ్ విద్యుత్ డిమాండ్ రికార్డు 3,276 మెగావాట్లు. రోజు వినియోగం 67 మిలియన్ యూనిట్లకు మించలేదు. కానీ ఓట్ల లెక్కింపు రోజు మాత్రం దాదాపు 1.95 మిలియన్ యూనిట్లు అధికంగా అంటే 68.95 మిలియన్ యూనిట్లు ఖర్చయింది. జనం టీవీలకు అతుక్కుపోవడంతో విద్యుత్ ఉపకరణాలన్నీ నిరంతరాయంగా పనిచేయడం వల్లే ఇంతలా విద్యుత్ ఖర్చయిందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.