mydukur: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి.. టీడీపీ అభ్యర్థి పుట్టా సంచలన ఆరోపణ
- ఈవీఎం ఓట్లకు-వీవీప్యాట్ స్లిప్పుల మధ్య తేడా
- సుగాలితండా వీవీప్యాట్లో పోలైన ఓట్లు 219
- ఈవీఎంలో పోలైన ఓట్లు 233
మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయన్నారు. వీవీప్యాట్ ఓట్లకు ఈవీఎంలో పోలైన ఓట్లకు పొంతన లేకుండా పోయిందని అన్నారు. శుక్రవారం ఆయన మైదుకూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గంజికుంటలోని సుగాలితండాకు చెందిన ఈవీఎంలలో 233 ఓట్లు పోలవగా, వీవీప్యాట్లలో 219 ఓట్లు మాత్రమే పోలైనట్టు చూపిస్తోందన్నారు. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు.
నియోజకవర్గంలోని 269 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాతే పూర్తి ఫలితాన్ని వెల్లడించాలంటూ ఆర్వోకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నియోజకవర్గంలో మొత్తం 30 వేల వరకు ఓట్లు ట్యాంపర్ అయినట్టు అనుమానంగా ఉందన్నారు. ఓటమి చెందినంత మాత్రాన తాను నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోనని, నిత్యం ప్రజల్లోనే ఉంటానని సుధాకర్ స్పష్టం చేశారు.