Revanth Reddy: తండ్రీకొడుకుల అహంకారం అణచేందుకే ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చారు: రేవంత్ రెడ్డి
- మల్కాజ్ గిరి ఎంపీగా ఎన్నికైన రేవంత్
- కేసీఆర్, కేటీఆర్ లపై ధ్వజం
- కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపాటు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ స్థానం నుంచి దారుణ పరాజయం చవిచూసిన రేవంత్ లోక్ సభ ఎన్నికలను మాత్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మల్కాజ్ గిరి స్థానంలో ఎంతో శ్రమించి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును ఎంతో బాధ్యతగా స్వీకరిస్తున్నట్టు చెప్పారు.
అంతేగాకుండా, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 9 స్థానాలకే పరిమితం చేయడం ద్వారా ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో కేసీఆర్ కుటుంబపాలన సాగిస్తున్నారని, తండ్రీకొడుకుల అహంకారాన్ని అణచివేసేందుకు ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇక, తనను ఈ ఎన్నికల్లో గెలిపించిన మల్కాజ్ గిరి ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.